మీరు వాడేది ఆండ్రాయిడ్ ఫోనా.. మీ ఫోన్ సిస్టమ్ అప్‌డేట్ అడుగుతుందా.. #Android #Smartphones

No Comments

Android Smartphones: మీరు వాడేది ఆండ్రాయిడ్ ఫోనా.. మీ ఫోన్ సిస్టమ్ అప్‌డేట్ అడుగుతుందా.. అసలు విషయం ఏంటంటే..


ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు కాస్తంత జాగ్రత్త పడాల్సిన అవసరమొచ్చింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కొత్త మాల్‌వేర్ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు చెందిన మొబైల్ సెక్యురిటీ కంపెనీ 'జింపీరియం' హెచ్చరించింది. ఈ కొత్త మాల్‌వేర్ ఆండ్రాయిడ్ యూజర్లను సులువుగా బురిడీ కొట్టించేందుకు సిస్టమ్ అప్‌డేట్‌లా కనిపిస్తుందని తెలిపింది. ఒకవేళ.. పొరపాటున ఫోన్‌ను అప్‌డేట్ చేద్దామని ఆ మాల్‌వేర్‌పై క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ఒక్క క్లిక్‌తో ఫసక్కేనని 'జింపీరియం'కు చెందిన జెడ్ ల్యాబ్స్ హెచ్చరించింది. ఒక్కసారి ఆ హ్యాకర్ల ఆధీనంలోకి మీ ఆండ్రాయిండ్ ఫోన్ వెళితే.. ఫోన్ కాల్స్ కూడా ఆడియో రూపంలో వాళ్లు రికార్డ్ చేస్తారని చెప్పింది. అంతేకాదు, ఫోన్‌లో ఉన్న ఫొటోలు, బ్రౌజింగ్ హిస్టరీ, వాట్సాప్ మెసేజ్‌లు.. ఇలా ఫోన్‌లో ఉండే వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని ఈ మాల్‌వేర్‌ను అడ్డం పెట్టుకుని హ్యాకర్లు పొందే అవకాశముందని జెడ్ ల్యాబ్స్ తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ మాల్‌వేర్‌కు సంబంధించిన ఎలాంటి యాప్ లేదని గూగుల్ నిర్ధారించింది. అయితే.. థర్డ్ పార్టీ స్టోర్ ద్వారా ఈ యాప్ ఇన్‌స్టాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ స్పైవేర్ ఎప్పటికప్పుడు ఫోన్‌లో చర్యలను గమనిస్తుందని.. మీకు ఎవరైనా ఫోన్ చేసినా, మీరు ఎవరికైనా ఫోన్ చేసినా ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా కాల్ రికార్డ్ అవుతుందని జెడ్‌ల్యాబ్స్ తెలిపింది. కాల్ లాగ్‌ను కూడా ఆ మాల్‌వేర్ తస్కరిస్తుందని చెప్పింది. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ మాల్‌వేర్ చర్యలను ఒకవేళ ట్రేస్ చేయాలని భావించినా.. మన డేటా చోరీ కాకుండా ఆపడం కష్టమని జెడ్‌ల్యాబ్స్ తెలిపింది.

కారణమేంటంటే.. ఒక్కసారి మాల్‌వేర్ సాయంతో హ్యాకర్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాక సెకన్ల వ్యవధిలోనే ఆ డేటా అంతా వెంటనే ట్రేస్ చేయడానికి వీలు లేకుండా డిలీట్ అయిపోతుంది. ఆలోపే.. స్పైవేర్ ప్రైవేట్ స్టోరేజ్‌లో డేటా సేవ్ అయిపోతుందని జెడ్ ల్యాబ్స్ తెలిపింది. ఈ మాల్‌వేర్ ఎలా అటాక్ అవుతుందంటే.. ఒకవేళ మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నా 'Searching for update' పేరుతో ఓ నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్ అప్‌డేట్ అడుగుతుందేమోనని భావించి క్లిక్ చేసి అప్‌డేట్ చేయగానే మీ ఫోన్‌పై ఈ మాల్‌వేర్ అటాక్ మొదలవుతుంది. ఒక్కసారి మాల్‌వేర్ దాడి మొదలయ్యాక మీకు తెలియకుండానే ఈ కింద పేర్కొన్న డేటా అంతా తస్కరించబడుతుంది.

మెసెంజర్‌లో పంపుకున్న మెసేజ్‌లు
మెసెంజర్ డేటాబేస్ ఫైల్స్
బ్రౌజర్‌లోని బుక్‌మార్క్స్, సెర్చెస్
గూగుల్ క్రోమ్‌, మొజెల్లా ఫైర్‌ఫాక్స్, శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌లోని బుక్‌మార్క్స్, సెర్చ్ హిస్టరీ
ఆడియో రికార్డులు
ఫోన్ కాల్ రికార్డింగ్స్
ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీలు, ఫొటోలు
ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన అప్లికేషన్ల సమాచారం
జీపీఎస్ లొకేషన్ మోనిటరింగ్
ఎస్‌ఎంఎస్ మెసేజ్‌లు
ఫోన్ కాంటాక్ట్స్
కాల్ లాగ్స్

back to top