విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైనా ఆలోచనలు చేయాలని సూచించారు. విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల
అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఘటన అనంతరం తీసుకుంటున్న చర్యలపై వివరాలను మంత్రులు, అధికారులు సిఎంకు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాల్లో లీగల్ హెయిర్ ఫైనల్ అయిన 8 మందిలో 5 గురికి పరిహారం చెలించామని, మిగిలి వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి కూడా అందించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్ పనులు పూర్తి చేసి, ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు. మంత్రులంతా ఆ ఐదు గ్రామాల్లో రాత్రికి బసచేయాలని, స్థానికులకు భోజన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్యాస్‌లీక్ ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10వేలు అందించాలని చెప్పామని, పిల్లలైనా, పెద్దలైనా అందరిని లెక్కలోకి తీసుకుని, పదివేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలని, అన్‌ఇన్‌కంబర్డ్ ఖాతాల్లో డబ్బు వేసేలా బ్యాంకర్లతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరిపేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదుచేసుకోవాలో వివరాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమం మూడు రోజుల్లో పూర్తికావాలని ఆదేశించారు. డబ్బు ఖాతాల్లో జమచేసిన తర్వాత వాలంటీర్ల ద్వారా వారికి స్లిప్ అందించి, వారినుంచి రశీదు తీసుకోవాలన్నారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవలకోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీకి చెందిన వైద్యుల బఅందాన్ని ఈ ప్రాంతంలోని వారికి వైద్య సేవలను అందించడానికి నియమిస్తున్నామని విశాఖ కలెక్టర్ సిఎంకు వెల్లడించారు. స్టెరెన్ తరలింపు కార్యక్రమం ప్రారంభమైనట్లు తెలిపారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా సురక్షిత స్థాయిలో ఉందని వెల్లడించారు. ట్యాంకులోని స్టెరెన్ కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్ అయ్యిందన్నారు. ఇదికాకుండా ఇంకో ఐదు ట్యాంకుల్లో 13వేల టన్నుల స్టెరెన్ ఉందని, దాన్ని కొరియాకు తరలిస్తున్నామని తెలిపారు. 8వేల టన్నులను ఒక వెసల్ ద్వారా తరలిస్తున్నామని చెప్పారు. మరొక వెసల్‌కూడా అందుబాటులోఉందని, దీనిద్వారా మిగిలిన 5 వేల టన్నులను తిరిగి కొరియాకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటి సిఎం ఆళ్లనాని, సిఎస్ నీలం సహాని, డిజిపి గౌతం సవాంగ్ హాజరవ్వగా విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కన్నబాబు, బత్స సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కఅష్ణ దాస్, కలెక్టర్ వినరుచంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తదితరులు పాల్గన్నారు.